
జేబులో పేలిన పవర్ బ్యాంక్!
జేబులో పేలిన పవర్ బ్యాంక్!
తరగతి గదిలో ఘోర ప్రమాదం.. బాలుడికి తీవ్ర గాయాలు
కొత్తూరు(డి) గ్రామంలో నాలుగో తరగతి విద్యార్థికి తప్పని ముప్పు
చెత్తకుప్పలో దొరికిన పరికరాన్ని జేబులో పెట్టుకున్న చిన్నారి
హుటాహుటిన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలింపు
నేటికేసరి కోహీర్ ఆగస్ట్ 25
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ కోహీర్ మండలం కొత్తూరు(డి) గ్రామంలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్లే దారిలో దొరికిన ఓ పవర్ బ్యాంక్ పేలి, నాలుగో తరగతి చదువుతున్న రాకేష్ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉదయం బడికి వెళ్తున్న సమయంలో రాకేష్‌కు దారి పక్కన ఉన్న చెత్తకుప్పలో ఒక పవర్ బ్యాంక్ కనిపించింది. పసివాడు కావడంతో ఆ పరికరాన్ని ఆసక్తిగా గమనించి, దానిని తీసుకుని తన జేబులో పెట్టుకుని పాఠశాలకు వెళ్లాడు. బడికి చేరుకుని తరగతి గదిలో కూర్చున్న కొద్దిసేపటికే.. జేబులో ఉన్న ఆ పవర్ బ్యాంక్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ అనూహ్య ఘటనతో తరగతి గదిలోని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ధాటికి రాకేష్ పొట్ట, తొడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. రక్తమోడుతున్న బాలుడిని చూసి చలించిపోయిన ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి.. మెరుగైన వైద్యం కోసం బాలుడిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. పసివాడికి జరిగిన ఈ ఘోర ప్రమాదం పట్ల గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. దారిలో దొరికే తెలియని వస్తువులకు పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Share this article



