
శాంతియుతంగా మిలాద్ ర్యాలీ!
శాంతియుతంగా మిలాద్ ర్యాలీ! * బైకులు, డీజేలు, సౌండ్ సిస్టమ్‌లకు నో పర్మిషన్ * రెచ్చగొట్టే నినాదాలు చేస్తే వారిదే పూర్తి బాధ్యత: మిలాత్ కమిటీ * బుధవారం ఉదయం 10:30 గంటలకు ఈద్గా నుంచి ర్యాలీ ప్రారంభం * ప్రతి ఏడాదీ లాగే నిరుపేద ఆడపిల్లల వివాహాలు * పోలీసు, మున్సిపల్ అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి నేటికేసరి జహీరాబాద్ ఆగస్ట్ 25: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఈద్ పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బుధవారం ఉదయం 10:30 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు జహీరాబాద్ మిలాత్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ర్యాలీ స్థానిక ఈద్గా నుంచి ప్రారంభమై గడి, సింథం మహల్లా, మరియు జాతీయ రహదారి మీదుగా సాగి తిరిగి ఈద్గా వద్ద ముగుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు.. ఈ ర్యాలీ పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరగాలని కమిటీ స్పష్టం చేసింది. ర్యాలీలో బైకులు, డీజేలు, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని తేల్చి చెప్పారు. అలాగే ఎలాంటి రెచ్చగొట్టే నినాదాలు చేయడం పూర్తిగా నిషేధమన్నారు. ఎవరైనా ఈ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే దానికి వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై తీసుకునే చర్యలకు కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీసులకు, మున్సిపల్ సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అదేవిధంగా అధికారులంతా ర్యాలీ సాఫీగా సాగేందుకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పేద యువతుల వివాహాలు.. పండుగను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా నిరుపేద ఆడపిల్లల వివాహాలు ఘనంగా జరిపిస్తున్నట్లు మిలాత్ కమిటీ తెలిపింది. ఈ సత్కార్యానికి పట్టణ ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ప్రవక్త మార్గం - శాంతికి ప్రతీక: మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఒక గొప్ప సందేశం. ఆయన ఎల్లప్పుడూ శాంతి, సహనం, సోదరభావం మరియు పేదల పట్ల దయను బోధించారు. కక్షలు, ద్వేషాలకు తావులేకుండా అందరూ సమానమే అని చాటిచెప్పారు. ఆయన చూపిన ఆ శాంతియుత మార్గంలో నడుస్తూ, తోటివారికి సహాయం చేస్తూ ఈ పండుగను ఆదర్శవంతంగా, ప్రశాంతంగా జరుపుకుందామని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.
Share this article



